
మన్నార్ పోలూర్ , నెల్లూరు జిల్లా, సూళ్ళూరుపేటకు అతి సమీపములో వెలసిన ఒక అపురూప మందిరము ఈ అళగ మల్లహరి కృష్ణ దేవస్థానము. పూర్వము సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణి ని అతని తమ్ముడు ప్రసేనుడు ధరించి వేటకు వెళ్ళగా, ఒక సిమ్హము అతనిని చంపి ఆ మణిని తీసుకొని పోగా, జాంబవంతుడు ఆ సిమ్హమును చంపి ఆ మణిని తనకూతురైన జాంబవతికి బహుమతిగా ఇచ్చెను. సత్రాజిత్తు, ఆ మణిని శ్రీకృష్ణుడే అపహరించెనని తన రాజ్యమున చాటింపు వేయగా, తనపై పడిన నిందను మాపుకొనుటకు ఆ మణిని వెతకనారంబింపగా, ఆ మణిని జాంబవంతుని గుహయందు జాంబవతి ఆడుకొనుట చూసి అది ఇమ్మని అడుగగా జాంబవంతుడు నిరాకరించి ద్వంద్వ యుద్దమునకు తలపడెను. 21 రోజులు యుద్దము జరిగిన పిమ్మట తన జవసత్వములు ఉడిగిన పిమ్మట జాంబవంతుడు ఈతను శ్రీరామ చంద్రుని అవతారమని గ్రహించి, తనకు త్రేతా యుగమున ఇచ్చిన మాటకొరకు తనతో ద్వంద్వ యుద్దము జరిగెనని గ్రహించి, తన తప్పుకు క్షమాపణలు కోరి, జాంబవతిని ఇచ్చి వివాహము జరిపించెను. శ్రీకృష్ణుల వారు, సత్రాజిత్తు నకు ఆ శమంతకమణిని తిరిగి ఇవ్వగా, తను చేసిన తప్పును తెలుసుకొని పరిహారముగా తనకూతురు సత్యభామను ఇచ్చి వివాహము జరిపెను. అందమైన కృష్ణుడు (అళఘ), మల్లయుద్దము జరుగుటవల్ల (మల్ల హరి) అళఘ మల్ల హరి దేవస్థానము అని పిలిచెదరు. ఇచట స్వామి వారు సత్యభామ మరియూ జాంబవతీ సమేతుడై ఉండెను. సుమారు 1000 సంవత్సరముల పైన చరిత్ర ఉన్న ఈ మందిరము చాల సుందరమైనది.










